తిరుపతి శ్రీ కోదండ రామాలయం ప్రాచీన చరిత్ర
తిరుపతిలో ఉన్న ప్రముఖ ఆలయాలలో మూడవది శ్రీ కోదండ రామాలయం. మొదటిది గోవిందరాజాలయం. రెండవది కపిల తీర్థం.
ఈ ఆలయాన్ని మొదట్లో పెరియ రఘునాథాలయం అనేవారు. ఈ స్వామికి పెద్ద రఘునాథుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే గోవింద రాజుల ఆలయంలో మరో రఘునాథుడు ఉన్నాడు.
ఈ ఆలయాన్ని 1480 లో విజయనగర రాజు సాలువ నరసిం హ దేవ రాయలు నిర్మించాడు. ఈయన శ్రీ క్రిష్ణ దేవరాయలుకు ముందు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజు. శాసనాల్లో ఈయన పేరు నరసిం హ మొదలియార్ అని ఉంది. అది ఎందువల్లనో తెలియదు.
నిజానికి ఈ ఆలయం మొదట్లో కపిల తీర్థం దగ్గర ఉండేది, అది ముస్లిం దండయాత్రల వలన ధ్వంసం అయితే ఇక్కడ పునర్మించారు అనే అభిప్రాయం కూడా ఉంది. విగ్రహాలు రామచంద్ర గుంటలో దొరికితే జనమేజయుడు ఇక్కడ ప్రతిష్టించాడు అని స్థల పురాణం చెపుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎదురుగా అంజనేయ స్వామి గుడి ఉంది.
ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే రాముల వారికి కుడిచేతి వైపున సీతామాత ఉంటుంది. ఇలా సీతారాములు ఉండడం చాలా అరుదైన విషయం.
కొండమీదున్న శ్రీవారి ఆలయంలో ఉన్న రాముల వారి మేడలో కూడా ఇలాంటి సీతారాములే కొలువై ఉండడం ఇంకో విశేషం. ఈ విగ్రహాలను రామానుజుడికి ఎవరో బహూకరించగా ఆయన వాటిని రాముల వారి మేడలో ఉంచాడట. రామానుజుడు దాదాపు వెయ్యేళ్ళకు ముందు ఈ భూమి మీద నడయాడిన మహనీయుడు.

Comments
Post a Comment