తిరుపతిలో తప్పక చూడవలసిన ఆలయాలు - 1

తిరుపతి నడిబొడ్డున రైల్వే స్టేషన్ ఎదురుగా గోవిందరాజ స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం నిర్మాణం తోనే తిరుపతి నగరం పుట్టుక ప్రారంభం అయింది.

దాదాపు వెయ్యి సంవత్సరాలకు ముందు రామానుజుడు ఈ ఆలయాన్ని నిర్మించి గోవిందరాజ స్వామిని ప్రతిష్టించాడు. గర్భాలయం లోని గోవిందరాజస్వామి విగ్రహం అనుకోని పరిస్థితులలో అప్పటికప్పుడు సున్నంతో తయారుచేయబడింది. అభిషేకం చేస్తే సున్నం కరిగిపోతుంది కనుక ఈ స్వామికి అభిషేకం ఉండదు. తమిళనాడు చిదంబరంలోని గోవిందరాజస్వామి ఆలయానికి, ఈ ఆలయానికి దగ్గర సంబంధం ఉంది.

ఈ స్వామి పక్కనే శ్రీ కృష్ణుడు పార్థసారథి స్వామి అవతారంలో కొలువై ఉంటాదు. నిజానికి ఈ ఆలయం ఈయనదే. అప్పటికే కొలువై ఉన్న పార్థసారథి స్వామి ఆలయంలో గోవిందరాజ స్వామిని ప్రతిష్టించాడు రామానుజాచార్యుడు. ఇందుకు నిదర్శనంగా పార్థసారథిస్వామికి ఎదురుగానే ధ్వజస్థంభం, బలిపీఠం ఉండదం ఈనాటికీ మనం చూడొచ్చు.

ఈ గోవిందరాజ స్వామి ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా అద్భుతమైన కళాసంపదతో కొలువై ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో అనేకమైన ఉపాలయాలు, మఠాలు ఉన్నాయి. చిన రఘునాథుడు అనే పేరుతో వెలసిన శ్రీరాముడు ఉన్నాడు.

ఈ ఆలయానికి ముందున్న మట్లి రాజుల చేత నిర్మాణం కాబడిన రాజగోపురం మహద్భుతమైనది. ఈ గోపురం మీద గొప్ప శిల్పాలు ఉంటాయి. ఆ శిల్పుల కౌశలం అశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ గోపురం మీద అనేక శృంగార శిల్పాలు చెక్కబడిఉంటాయి. ఈ గోపురాన్నే గాలి గోపురం అని కూడా అంటారు. దీని కింద నిలబడితే వేగంగా వీస్తూ చల్లని గాలి మనలను తాకుతూ ఉండి ఎంతో హాయిని కలిగిస్తుంది. 

Comments

Popular posts from this blog

తిరుపతి శ్రీ కోదండ రామాలయం ప్రాచీన చరిత్ర